Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
మాఘ పురాణం - 25
25వ అధ్యాయము - కలింగ కిరాతుడు - మిత్రుల కథ

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును 'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుదు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ నాకుటుంబమున కుమారుడు, తల్లి యిద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ యింటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను, వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి యిచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లుత్రాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.

ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్టు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి యింటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని, సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును, పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము, మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషలుము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూదుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్యదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.

పురాణం - 26
26వ అధ్యాయము - పుణ్యక్షేత్రములలో నదీస్నానము

ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా, ఆ రాజు "మహర్షి! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశాయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం" డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.


ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో యెన్నో నదులున్నవి, ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి, ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే "వరం తప" అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, యీశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు యిద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి "భిక్షాందేహీ" యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, అతనికి "పురుషత్వము నశించునుగాక" అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటిసూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 25-02-2020, 08:27 PM



Users browsing this thread: 3 Guest(s)