Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
మాఘ పురాణం - 22

22వ అధ్యాయము - క్షీరసాగరమధనము

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు, అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.


దేవదానవులు చేసిన శివస్తుతి
నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే
నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||
నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ
నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||
త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక
త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||
త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే
అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||
హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే
మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||
పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్

అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.

ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.


రాహుకేతువుల వివరణ
రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.

చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.


ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.

ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి యింద్రునకు ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.


మాఘ పురాణం - 23

23వ అధ్యాయము - నారదుని దౌత్యము - దేవతల దైన్యము

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి యింద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాతవృక్షమును పెకలింపదలచ్చిహి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకాశపది భూమిపై వ్రానియవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన యాశ్రమమునకు పోయెను.

ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధాపూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదనొకండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.


నారదకృత విష్ణుస్తుతి
ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||
మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||
అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||
నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||
నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||
సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||
పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||
త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||
త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||
త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||
ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||

నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె 'నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై యింద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలె దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.

నారదుని మాటలను విని శ్రీహరి 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు నింద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు నింద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు నింద్రుడు వాని యనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికాని, తెలియకకాని దటిన, తొక్కిన యెంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ సుక్ల పాద్యమి మొదలు నేటి వరకు పదనొకందు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము నర్చించునే యునాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు యెవరైనను యేకాడశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక తన దారిన బోయెను అని గృత్నృమదమహాముని జహ్నువునకు చెప్పెను.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 25-02-2020, 08:23 PM



Users browsing this thread: 1 Guest(s)